శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు
బుద్ధి హీనతను కలిగిన తనువులు బుద్భుదములని తెలుపు సత్యములు
జయ హనుమంత జ్ఞాన గుణవందిత జయ పండిత త్రిలోక పూజిత
రామదూత అతులిత బలధామ అంజనీపుత్ర పవనసుతనామ
ఉదయభానుని మధురఫలమని భావనలీల అమృతమును గ్రోలిన
కాంచన వర్ణ విరాజిత వేష కుండల మండిత కుంచిత కేశ
రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి రాజపదవిని సుగ్రీవున నిలిపి
జానకీపతి ముద్రిక దోడ్కొని జలధి లంఘించి లంక జేరుకొని
సూక్ష్మరూపమున సీతను జూచి వికటరూపమున లంకను గాల్చి
భీమరూపమున అసురుల జంపిన రామకార్యమును సఫలము జేసిన
సీత జాడ గని వచ్చిన నినుగని శ్రీరఘువీరుడు కౌగిట నిను గొని
సహస్ర రీతుల నిను గొనియాడగ కాగల కార్యము నీపై నిడగ
వానర సేనతో వారిధి దాటి లంకేశునితో తలపడి పోరి
హోరుహోరున పోరు సాగిన అసురసేనల వరుసన గూల్చిన
లక్ష్మణ మూర్ఛతో రాముడడలగ సంజీవి దెచ్చిన ప్రాణప్రదాత
రామలక్ష్మణుల అస్త్రధాటికి అసురవీరులు అస్తమించిరి
తిరుగులేని శ్రీరామబాణము జరిపించెను రావణ సంహారము
ఎదురు లేని ఆ లంకాపురమున ఏలికగా విభీషణు జేసిన
సీతారాములు నగవుల గనిరి ముల్లోకాల హారతులందిరి
అంతులేని ఆనందాశృవులే అయోధ్యాపురి పొంగి పొరలె
సీతారాముల సుందరమందిరం శ్రీకాంతు పదం నీ హృదయం
రామచరిత కర్ణామృతగాన రామనామ రసామృత పాన
దుర్గమమగు ఏ కార్యమైనా సుగమమే యగు నీ కృప జాలిన
కలుగు సుఖములు నిను శరణన్న తొలగు భయములు నీ రక్షణ యున్న
రామద్వారపు కాపరివైన నీ కట్టడి మీర బ్రహ్మాదుల తరమా
భూత పిశాచ శాకినీ ఢాకినీ భయపడి పారు నీ నామజపము విని
ధ్వజ విరాజ వజ్ర శరీర! భుజబలతేజ గదాధర!
ఈశ్వరాంశ సంభూత పవిత్ర! కేసరిపుత్రా పావన గాత్ర!
సనకాదులు బ్రహ్మాది దేవతలు శారద నారద ఆదిశేషులు
యమ కుబేర దిక్పాలురు కవులు పులకితులైరి నీ కీర్తిగానముల
సోదర భరత సమానా యని శ్రీరాముడు ఎన్నిక గొన్న హనుమా
సాధుల పాలిట ఇంద్రుడవన్నా అసురుల పాలిట కాలుడవన్నా
అష్టసిద్ధి నవనిధులకు దాతగ జానకీ మాత దీవించెనుగ
రామ రసామృత పానము జేసిన మృత్యుంజయుడవై వెలసిన
నీ నామ భజన శ్రీరామ రంజన జన్మజన్మాంతర దుఃఖ భంజన
ఎచ్చటుండిన రఘువరదాసు చివరకు రాముని చేరుట తెలుసు
ఎందెందున శ్రీరామ కీర్తన అందందున హనుమాను నర్తన
శ్రద్ధగ దీనిని ఆలకింపుమా శుభమగు ఫలములు కలుగు సుమా
భక్తి మీరగ గానము చేయగ ముక్తి గలుగు గౌరీశులు సాక్షిగ
తులసీదాస హనుమాను చాలీసా తెలుగున సుళువుగ నలుగురు పాడగ
పలికిన సీతారాముని పలుకున దోషములున్న మన్నింపుమన్న!
మంగళ హారతి గొను హనుమంత!
సీతారామ లక్ష్మణ సమేత
నా అంతరాత్మ నిలుమో అనంత!
నీవే అంతా! శ్రీ హనుమంత!
No comments:
Post a Comment